చందమామ కథలు – గురువుగారి పరీక్ష

Chandamama Kathalu

ఎన్నో ఏళ్ల క్రితం వైశాలీ అనే రాజ్యంలో చిత్రగుప్తుడు అనే ఓ న్యాయపరుడు, దయాగుణమున్న రాజు జీవించేవాడు. ఆయన ప్రజలను తన సంతానంలా ప్రేమించేవాడు. కానీ రాజుకు తనకు సంతానం లేకపోవడంతో, కొద్ది కొద్దిగా రాజ్యపాలనలో ఆసక్తి తగ్గిపోయింది. ఇది గమనించిన మంత్రి సునందుడు చాలా ఆందోళన చెందాడు. “రాజు నిర్లక్ష్యం చేస్తే శత్రువులు బలపడతారు. రాజ్యం కూలిపోతుంది” అని అతడు ఆలోచించాడు. రాజు కోసం మార్గం చూపమని గురువైన పరమానందుని ఆశ్రయించాడు. #Chandamama Kathalu Guvugari Pariksha#

గురువు “రాజు పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది” అని సలహా ఇచ్చారు. గురువుగారి సలహాతో రాజు ఆ యాగం చేశారు. దీనితో ఆయనకు ఇద్దరు కుమారులు పుట్టారు. వారికి జయుడు, విజయుడు అని పేర్లు పెట్టారు. ఇదే సమయంలో మంత్రి సునందుడికి కూడా ఓ కుమారుడు పుట్టాడు. అతనికి సుబుద్ధి అని పేరు పెట్టాడు. ముగ్గురు కలిసి పెరిగారు. వారు గురువు పరమానందుని ఆశ్రమానికి వెళ్ళి విద్యలు అభ్యసించారు. వారు వీరత్వం, జ్ఞానం, నిజాయితీ వంటి ఎన్నో గుణాలు నేర్చుకున్నారు.

వారి విద్య ముగియబోతున్న రోజుల్లో, గురువు వారిని పరీక్షించాలని నిర్ణయించాడు. వారి ముగ్గురితో “ఇక్కడికి దగ్గర్లోని ఓ గ్రామంలో ఒక శిల్పి నాకు మూడు విగ్రహాలు చేసి ఇస్తామన్నాడు. మీరు రేపు మధ్యాహ్నం లోపు జాగ్రత్తగా తీసుకువచ్చి నాకు ఇవ్వండి” అని గురువుగారు చెప్పారు.

ముగ్గురు ఆనందంగా ప్రయాణం మొదలు పెట్టారు. కానీ అడవిలోకి వెళ్ళగానే దొంగల గుంపు వారిని ఆపింది. జయుడు ధైర్యంగా ఖడ్గం తీయగా, విజయుడు కూడా సహాయం చేయాలనుకున్నాడు. అప్పుడు సుబుద్ధి రాజకుమారులతో
“మనకు గురువుగారు ఇచ్చిన పని ముఖ్యమైనది. ఎవరైనా ఒకడు వెంటనే ముందుకు వెళ్ళాలి. విజయా! నువ్వు పో. నేను జయుడితో కలిసి వీరిని ఎదుర్కొంటాను” అని అన్నాడు.

విజయుడు వెంటనే పరుగెత్తి శిల్పి దగ్గరకు వెళ్లాడు. జయుడు, సుబుద్ధి ధైర్యంగా పోరాడి దొంగలను తరిమేశారు. విజయుడు ఆ శిల్పి దగ్గర నుంచి విగ్రహాలను తీసుకొని వచ్చాడు.  తరువాత ఒక్కొక్కరు ఒక్కో విగ్రహం తీసుకుని ఆశ్రమం వైపు బయల్దేరారు.

అప్పుడే మార్గమధ్యంలో ఒక అపశ్రుతి జరిగింది. రహదారిపై నలుగురు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో ఓ రథం వేగంగా చిన్నారుల వైపు వస్తోంది. ఆ రథాన్ని చూసి ముగ్గురు పిల్లలు భయపడి పక్కకు జారుకున్నారు. కానీ చిన్నవాడు తెలియక రహదారిపైనే ఏడుస్తూ నిలబడిపోయాడు. రథం అతడిని తొక్కేసే ప్రమాదం దగ్గర పడింది. #Chandamama Kathalu Guvugari Pariksha#

ఆ సమయంలో జయుడు కేవలం విగ్రహం గురించే ఆలోచించాడు. “ఆగితే ఆలస్యం అవుతుంది. ఒక చిన్నవాడి ప్రాణం కన్నా, గురువు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే ముఖ్యమని” అనుకున్నాడు. సుబుద్ధి కూడా ఆగకుండా నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. కానీ విజయుడు మాత్రం ముందుకు అడుగువేయలేకపోయాడు. చిన్న పిల్లాడి ముఖం చూసి అతని హృదయం కరిగిపోయింది. “విగ్రహం మళ్లీ తయారు చేయవచ్చు. కానీ ప్రాణం తిరిగి రాదు” అని అతను భావించాడు. వెంటనే విగ్రహాన్ని జాగ్రత్తగా నేలపై ఉంచి పరుగెత్తుకెళ్లి, చిన్నారి రథం కింద పడకుండా కాపాడాడు.

ఆ తర్వాత ముగ్గురూ ఆశ్రమానికి చేరుకున్నారు. గురువు వారిని చూసి, “ఈ విగ్రహాలు తేవడం నిజమైన పరీక్ష కాదు. మీ మనస్సుకు, ఆలోచనలకు నేను పరీక్ష  పెట్టాను.  జయుడికి ధైర్యం ఉంది, సుబుద్ధికి జ్ఞానం ఉంది. కానీ విజయుడికి కరుణ ఉంది. కరుణ అనే గుణం అన్నిటికంటే గొప్పది. అందుకే నిజమైన విజేత విజయుడే” అని చెప్పారు. #Chandamama Kathalu Guvugari Pariksha#

ఇదంతా తెలుసుకున్న రాజు, మంత్రి తమ కుమారులను చూసి గర్వపడ్డారు. ఆ తరువాత ముగ్గురూ రాజ్యానికి ధైర్యం, జ్ఞానం, దయతో సేవచేశారు. వారి కథ తరతరాల పాటు ప్రజలకు ఒక పాఠమైంది.

✨ నీతి: ధైర్యం, జ్ఞానం గొప్పవే. కానీ దయ అన్నది వాటన్నిటికంటే గొప్పది. #Chandamama Kathalu Guvugari Pariksha#

Leave a Comment

error: Content is protected !!