సెకెండ్ ఛాన్స్‌

second chance love story

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. సాధారణంగా జీవితంలో రెండో ఛాన్స్ రాదని.. ఒకసారి కోల్పోయింది మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు అని అంటారు. నాకు ఆ సెకెండ్ ఛాన్స్ వచ్చింది. ఇంట్లో నుంచి కారు బయటకు తీస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న నర్సరీలు… “గుడ్ మార్నింగ్‌….” అంటూ పలకరించాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, పువ్వులు… “ఎక్కడికి వెళ్తున్నావోయ్…?” అంటూ ప్రశ్నించాయ్. చిరునవ్వే నా సమాధానమైంది. # సెకెండ్ ఛాన్స్‌ #

కడియం నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కు దాదాపు 30 నిమిషాల ప్రయాణం. అక్కడి నుంచి దానవాయ్పేట్కు మరో 10నిమిషాలు. ప్రస్తుతానికి అదే నా గమ్యస్థానం. ఓ ప్రయాణం ఇంత ఉత్కంఠగా ఉంటుందని, ఎన్నో చెప్పుకోలేని భావాలతో నా మనసు ఉక్కిరిబిక్కిరయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. జీవితం నేర్పిన పాఠాలు… వాటి చుట్టూ తిరిగే కథలు..  నన్ను ఒక్కసారిగా ఏడేళ్లు వెనక్కి నెట్టేశాయి.

అవి రాజమండ్రిలోని నా డిగ్రీ ఫైనల్ ఇయర్ రోజులు… ఇక జీవితంలో ఇలాంటి కాలేజ్ డేస్ రావనుకుని అందరూ బాధపడుతున్న రోజులవి. కానీ నాది మాత్రం వేరే ప్రపంచం… నా సావిత్రితో జీవితం పంచుకోవడానికి రోజులు లెక్కపెట్టుకోవడం…. క్యాలెండర్లో గడిచిపోయిన ఒక్కోరోజును కొట్టేయడం.. నిద్ర లేచిన వెంటనే నేను చేసే మొదటి పని. ఇంటర్ నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమే అయినా.. మా మధ్య ప్రేమ చిగురిచింది మాత్రం డిగ్రీలోనే. కొన్నికొన్ని బంధాలు అంతే.. జీవితం అనే పుస్తకంలో పేజీలు తిప్పే కొద్దీ… తెలియకుండానే వాటిలో మార్పులు జరుగుతూ ఉంటాయ్.

సావిత్రి చాలా సాధారణమైన అమ్మాయి. భవిష్యత్తు గురించి చింత లేకుండా.. ఈ నిమిషాన్ని ఆశ్వాదించాలనే సిద్ధాంతం తన సొంతం. ఎన్ని కష్టాలొచ్చినా తన ముఖం మీద చిరునవ్వు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. అది దేవుడు తనకిచ్చిన గొప్ప వరం.

నా సావిత్రికి గులాబీ అంటే చాలా ఇష్టం. అందులోనూ తెల్ల గులాబీ ఎక్కడ కనపడినా.. అలాగే చూస్తూ ఉండిపోతుంది. “మనిషి ప్రయాణం కూడా ఆ పువ్వు లాంటిదే… ముళ్లను పట్టుకునే ధైర్యం ఉంటేనే అందమైన గులాబీ మన సొంతమవుతుంద”ని ఎప్పుడూ అనేది.

నాలో తను ఏం చూసిందే నాకు తెలియదు. కానీ నా అడుగులో అడుగు వేయాలన్న తన నిర్ణయం.. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనను నాలో రేపింది. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.. నా చివరి శ్వాస వరకు మర్చిపోలేను.

మంచి ఎమ్బీఏ కాలేజీలో సీటు దొరికేలా చేయమని దేవుడిని ప్రార్థించడానికి… గోదారి గట్టు పక్కనే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లాను. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా పక్కనే ఉన్న మండపం నుంచి మంత్రాల శబ్దం వినపడింది. ఒక్కసారి అటువైపు చూశాను. మండపం ఎదురుగా కొందరు పెద్దలు కూర్చుని ఉన్నారు. మండపం చుట్టూ పిల్లలు ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. పెళ్లి పీటలపై వధూవరులున్నారు. ఆ వధువు నా సావిత్రిలా కనపడింది. ఒక్కసారి నా గుండె ఆగిపోయింది.

ప్రేమలో ఉన్నప్పుడు అందరూ సావిత్రిలాగే కనపడతారనుకుని తమాయించుకుంటూ.. కొంచెం దగ్గరికి వెళ్లాను. బుగ్గన దిష్టి చుక్క.. మెడలో బంగారు హారం, కాళ్లకు పారాణి, కళ్లకు నల్లటి కాటుకతో ఉన్న ఆ వధువు నా సావిత్రే అన్న నిజం రెండు నిమిషాల వరకు జీర్ణించుకోలేకపోయాను. నా చొక్కా చెమటతో తడిసిపోయింది. ఏవరో నన్ను పాతాళానికి తొక్కేస్తున్నట్టు అనిపించింది. వరుడు నా సావిత్రి మెడలో తాళి కడుతున్న ఆ దృశ్యాలు.. నా అంతర్యుద్ధానికి, ఎన్నో నిద్రలేని రాత్రులకు పునాదులయ్యాయి.

సావిత్రి పెళ్లి జరిగిన కొంత కాలం వరకు నాలో నేను లేను. ఒక్క కన్నీటి చుక్కను కూడా బయటకు రానివ్వలేదు. విషాన్ని తన కంఠంలో దాచుకున్న శివుడిలా.. నా బాధను నాలోనే దాచుకున్నాను. కానీ సావిత్రి జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. చివరికి ఆత్మహత్య చేసుకుందామని.. అదే గోదారి గట్టు దగ్గరికి వెళ్లాను.

నన్ను తన ఒడిలో చేర్చుకోవడానికి గోదారమ్మ స్వాగతం పలకుతున్నట్టు అనిపించింది. ప్రాణాలు తీసుకోవడం అంత సులభమా? అది కూడా ఒక అమ్మాయి కోసమా? అనిపించింది. జేబులో నుంచి పర్సు బయటకు తీసిన నాకు.. ఓ వైపు సావిత్రి ఫొటో.. మరోవైపు అమ్మ, నాన్న, తమ్ముడితో దిగిన ఫొటో కనిపించింది. అమ్మాయి మోసం చేస్తే.. అమ్మ నాన్నలకు నేనెందుకు దూరమవ్వాలి? వాళ్లేం తప్పు చేశారు? అన్న ప్రశ్నలు నా సుసైడ్ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేశాయి. # సెకెండ్ ఛాన్స్‌ #

ట్రాన్స్ఫర్తో నాన్న మా కుటుంబాన్ని హైదరబాద్కు మార్చడం కూడా నాకు సహాయపడింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రేమలో ఓడిపోయానన్న బాధో, అమ్మాయి మోసం చేసిందన్న కోపమో తెలియదు కానీ.. చాలా కసిగా చదివాను. రెండేళ్లల్లో ఎమ్బీఏ పూర్తి చేసి నెలకు 50వేల జీతంతో ఉద్యోగం మొదలు పెట్టాను. మరో ఏడాదికే ఆ జీతం నెలకు లక్ష రూపాయలుగా మారింది. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. కానీ నా సంపద నాకు సంతోషాన్నివ్వలేదు.

ఏదో బాధ, బయటకు చెప్పుకోలేని వ్యధ. ఎన్నేళ్లయినా సావిత్రి జ్ఞాపకాల ఒడి నుంచి బయటపడలేకపోయాను. కొన్ని కొన్ని సార్లు జ్ఞాపకాలకు దూరంగా పరిగెత్తే బదులు.. వాటిని అక్కున చేర్చుకోవడం ఎంతో అవసరం. మనశ్సాంతికి అది ఎంతో ముఖ్యం.

కొన్ని రోజుల పాటు బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. తమ్ముడు అప్పటికే ఉద్యోగం చేస్తున్నాడు. నా సంపదలో సగం తమ్ముడికి ఇచ్చి.. తల్లిదండ్రుల బాధ్యతను అప్పగించాను. నేను రాజమండ్రి పక్కనే ఉన్న కడియానికి బయలు దేరాను. మూడెకరాల భూమి కొనుక్కుని.. అందులో నర్సరీ పెట్టుకున్నాను. అందులో ఎక్కువగా ఉండేవి గులాబీ మొక్కలే. వాటికి నీళ్లుపోయడం వంటి పనుల కోసం ఓ సహాయకుడిని పెట్టుకున్నాను. అందేంటో తెలియదు కానీ… లక్ష రూపాయల జీతంతో రాని ఆనందం.. ఉదయపు సూర్యకిరణాల మధ్య ఆ పువ్వులు, మొక్కలను చూస్తుంటే కలిగింది. ఆఫీసులోని కొలీగ్స్‌తో కూర్చునప్పుడు కలగని సంతృప్తి… నర్సరీ మధ్యలో సహాయకుడితో కబుర్లు చెబుతూ చేసిన భోజనం వల్ల కలిగింది.

రాజమండ్రి పక్కనే ఉన్నా… అక్కడికి వెళ్లడానికి నాకు ధైర్యం చాలలేదు. నా కాలేజీని.. మా ఇంటిని చూడలేకపోయాను. సావిత్రి ఇల్లు చూడాలనిపించినా.. ఏదో భయం నన్ను ఆపేసింది. కానీ భర్తకు వేడివేడి పకోడీలు చేస్తూ… అత్తమామలతో కబుర్లు చెబుతూ.. పిల్లల హోంవర్క్ చేయిస్తూ సావిత్రి జీవితం చాలా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాను. మనకి దక్కకపోయినా… మనం ప్రేమించిన వాళ్లు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ. అలా ఏడాది గడిచింది.

ఓ సాయంత్రం పూట.. నర్సరీకి ఓ మహిళ వచ్చింది. నా సహాయకుడు ఆమెతో మాట్లాడుతుండగా నేను దూరం నుంచి గమనించాను. ఒక్కసారి నా గుండె ఆగిపోయింది. ఆమె అచ్చం సావిత్రిలా కనపడింది. కొంచెం దగ్గరికి వెళ్లి చూడగా.. తను సావిత్రే అని అర్థం చేసుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది. ఒక్కసారిగా నాలో కోపం పెరిగింది. దానికి మించిన బాధ నా మనసును కుదిపేసింది. కొన్ని వేల ప్రశ్నలు నా మెదడును చీల్చుకుని బయటకు రావడానికి ప్రయత్నించాయి. ఎందుకిలా చేశావ్? అని అడగాలనిపించింది.

కానీ సావిత్రి మోహం మీద చిరునవ్వు.. నుదుటి మీద బొట్టు.. మెడలో మంగళ సూత్రం లేకపోవడం గమనించాను. ఒక్కసారిగా నా బాధ, నా కోపం మాయమైపోయాయి. మాట్లాడాలా? వద్దా? అన్న సందిగ్ధంతో ఉక్కిరిబిక్కరవుతున్న నన్ను సావిత్రి చూసింది. ఆరేళ్ల తర్వాత మా కళ్లు కలిశాయి. తను ఏదో మాట్లాడటానికి ప్రయత్నించింది కానీ మాటలు బయటకు రాలేదు. తను కూడా నాలాగే ఆలోచనల్లో మునిగిపోయిందని అర్థమైంది.

అది జరిగిన కొద్ది రోజులకు నేను సావిత్రి మళ్లీ కలిశాము. ఆరేళ్లల్లో కొన్ని లక్షల సార్లు నేను అడగాలనుకున్న ప్రశ్నలకు సమాధానాలు… ఆ రోజు దొరికాయి. సావిత్రికి తన తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారు. తనను అడగకుండా.. తన మనసు తెలుసుకోకుండా సావిత్రిని పెళ్లి పీటలపై కూర్చోపెట్టారు. పెళ్లి విషయం అప్పటివరకు సావిత్రికే తెలియదు. నన్ను మోసం చేసిందనే బాధతో అత్తారింటిలో ఓ యంత్రంలా మిగిలిపోయింది సావిత్రి. తన తల్లిదండ్రులు చూడని మనసును మరెవరికీ చూపించకుండా రాయిలా మారిపోయింది.

కానీ ఆ పెళ్లి జరిగిన ఏడాదికే సావిత్రి భర్త ఓ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. మెట్టినిట్టిలో ఉండలేక… పుట్టింటికి వెళ్లలేక.. వైజాగ్లో ఓ చిన్న ఉద్యోగం చేస్తూ.. నా జ్ఞాపకాలతో ఇన్నేళ్లు ఉండిపోయింది. తండ్రికి ఓంట్లో బాలేదని తెలిసి.. అప్పటికి కొద్ది రోజుల ముందే రాజమండ్రి వచ్చింది.

సావిత్రి కథతో పోల్చుకుంటే… నా కథకున్న విలువెంత? తనపై ఇన్నేళ్లు నేను పెంచుకున్న కోపమెంత? చేయని తప్పుకు రెండు జీవితాలు ఇన్నేళ్లు దుఖంలో మునిగిపోయాయి. మూడు ముళ్లు వేయించి చేతులు దులుపుకున్న ఆ తల్లిదండ్రులకు.. చివరికి మిగిలింది కన్నీరే.

సావిత్రి మోసం చేసిందని నేను నమ్మడం జీవితంలో నేను చేసిన తప్పు. ఆ క్షణం తన పక్కన నిలబడే అర్హత కూడా కోల్పోయాను అనిపించింది. ఆరేళ్లల్లో ఎన్నడూ బయటకు రాని కన్నీళ్లూ.. వరదలా ఒక్కసారిగా తన్నుకొచ్చాయి. ఆరేళ్ల తర్వాత ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా పడుకున్నాను. # సెకెండ్ ఛాన్స్‌ #

కారు రాజమండ్రి రైల్వే స్టేషన్కు చేరుకుంది. సావిత్రిని నర్సరీలో చూసి సరిగ్గా నేటికి ఏడాది. ఈ సంవత్సర కాలంలో మా మధ్య తిరిగి స్నేహం వికసించింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా ఎప్పుడు మారిందో మా ఇద్దరికీ తెలియనే లేదు. తన కళ్లల్లో నా మీద కనపడే ప్రేమ.. ఏడేళ్ల నా మనోవేదనకు ఔషధం. జీవితంలో సెకెండ్ ఛాన్స్ లభించడం చాలా అరుదు. కానీ అది వస్తే మాత్రం జారవిడుచుకోకూడదు. “నన్ను జీవితాంతం వదలకు సావిత్రి…” అని ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనైనా చెబుదామని బయలు దేరాను.

కారు దానవాయపెట్లోని నా సావిత్రి ఇంటి ముందు ఆగింది. ఏడేళ్ల తర్వాత క్లీన్ షేవ్ చేసుకున్న నా ముఖాన్ని అద్దంలో చుసుకున్నాను. జుట్టు సరిచేసుకున్నాను. పక్కనే ఉన్న తెల్ల గులాబీ వైపు నా చూపులు మళ్లాయి. ఆ ముళ్లను పట్టుకునే ధైర్యం ఉంటేనే అందమైన గులాబీ మన సొంతమవుతుందన్న నా సావిత్రి మాటలు గుర్తొచ్చాయి. చేతిలో పువ్వు, కాళ్లల్లో వణుకు, మనసంతా ఉత్కంఠతో సావిత్రి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాను. # సెకెండ్ ఛాన్స్‌ #

ఈ మంచి కథ చదివారా?: మా అమ్మమ్మ

0 thoughts on “సెకెండ్ ఛాన్స్‌”

  1. Pingback: మా అమ్మమ్మ literature modern literature masterfm my grandma lakshmi

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?