వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా…

waiting for love

పెదవి దాటని మాట విభేదాలు కూడా ఇద్దరిని దగ్గర చేస్తాయనడానికి మన పరిచయమే ఉదాహరణ అనుకుంటాను. మొదటి పరిచయమే ఇద్దరి మధ్య భగ్గుమనేంత వైరం. కానీ మాటల్లో మాత్రం తేనె పూసిన కత్తిలా సుతి మెత్తని పలకరింపులు. తలచుకుంటేనే గమ్మత్తుగా ఉంది కదూ… రానియ్యి చూసుకుంటా… # వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… #

” మీ ఊరి పంచాయతీలో ఆడిట్ కోసం ఓఅబ్బాయిని వేశారంట… చూడడానికి బాగానే ఉన్నాడు గానీ.. మహా చండ శాసనుడంట. నీ పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుందే…అని నీ ఫ్రెండ్ అంటుంటే… ఏడిశాడు ఇలాంటోళ్లను ఎంత మందిని చూడలేదు. మహా ఏమిచేస్తాడులే.. తిట్టేస్తాడా.? కొడతాడా ఏంటి.. ఎక్కడి నుంచే ఉద్యోగం చేసుకోడానికొచ్చిన వాడికే అంత ఉంటే… ఊరిలో ఉంటూ.. ఊరు బలగమంతా వెనక ఉన్న దాన్ని నాకెంత ఉండాలే.. రానియ్యి ఇంకెప్పుడూ అమ్మాయంటే కలలో కూడా భయపడేలా చేస్తా”… ఇదీ నీ నోటి వెంట నా గురించి నీ ఫ్రెండ్తో అన్నప్పుడు నేను చాటుగా విన్న మాటలు.

అలా మొదలైంది..

ఉద్యోగ రీత్యా విజయనగరం వచ్చినప్పుడు మీ ఊరికి ఇన్ఛార్జిగా వేశారు. అమ్మాయిలంటే కాస్త బెరుకు. కాస్త కోపంగా ఉండే నాకు నీ మాటలు మరింత కోపాన్ని తెచ్చాయి. అందుకే మీ ఊరిలో ఉన్నన్ని రోజులూ నీ ఉద్యోగానికి ఎలాగైనా ఎసరు పెట్టాలనుకున్నాను. దానికి ఏ అవకాశం దొరికినా వదులుకోదలచుకోలేదు.

ఉన్నవి పదిరోజులైనా అంత గంభీరంగా ఉండే వాడిని అందుకే… కానీ అప్పుడప్పుడూ నీ ప్రవర్తన గానీ… మాట గాని గమనిస్తే వింతగా అనిపించేది… నువ్వేనా అలా అన్నది అని. ఉన్నన్ని రోజుల్లో నీకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు సంపాదించాను. కానీ ఏమిటో ఆ నివేదిక ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లినప్పుడు నిన్నేమి అనలేదు. ఏదో లాలూచీ జరిగిందని విసుగొచ్చింది. ఎప్పుడైనా… ఎక్కడైనా నీవు దొరక్కపోతావా అనుకున్నాను.

అదేంటో ఆరోజు ఇంటికి వచ్చేస్తున్నప్పుడు నీ నుంచి మెసేజ్.. కచ్చితంగా తిడుతూనే పట్టావనుకున్నా.. అలా జరగలేదు. చాలా థ్యాంక్స్ చెబుతూ మెసేజ్ నమ్మలేకపోయాను. ఏంటో ఈ అమ్మాయి ఎంత విపరీతంగా ప్రవర్తించినా ఏ మార్పులేదు. నేనే పొరబాటు పడ్డానా అనుకున్నాను. అందుకే రిప్లై ఇవ్వలేదు. # వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… #

తర్వాత నీ నుంచి ఫోన్. మొక్కుబడిగా మాట్లాడి పెట్టేశాను. ఎప్పుడు చేసినా ఏదో సాకుతో అరకొర మాట్లాడి పెట్టేసేవాడిని. నీకు గుర్తుందో లేదో… నేనెప్పుడూ బిజీనే అనే సమాధానమే ఇచ్చేవాడిని. నిన్ను దూరం చేస్తున్నాను అనుకున్నానే గానీ.. ఎప్పుడు నీ నుంచి ఫోన్ వస్తుందా తిడదామా అనుకుంటూ ఉండేవాడిని. అది నీపై కోపమే అనుకునేవాడిని.

ఓ వారంపాటు సిగ్నల్స్ అందుబాటులో లేని ప్రాంతానికి వెళ్లి వచ్చాక నీవు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు కోపపడిపోతుంటే ఏంటి ఈ అమ్మాయికి ఇంత చొరవ. తిడుతున్నా పట్టించుకోదా అనిపించింది. ఇలానే నెలలు గడిచిపోయాయి.

ఇలా ఎలా.. నాకు వ్యక్తిగతంగా ఓ సమస్య వచ్చిన సమయంలో నీవు ఫోన్ చేసినప్పుడు… నిన్ను ఎంతలా తిట్టానో గుర్తుందా… ఆరోజు నిన్ను ఎంత హేళనగా మాట్లాడానే గుర్తొస్తేనే సిగ్గుగా ఉంది. కానీ నువ్వు పదే పదే ఫోన్ చేసి నా బాధను ఎంత మరిపించావో నాకు తర్వాత గాని తెలియలేదు. # వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… #

వాస్తవంగా ఆ ఘటన నుంచి కోలుకున్నది నీ మాటలతోనేనేమో… నేను ఇంకెప్పుడూ ఫోన్ చేయొద్దన్న మాటకు నువ్వు వారం పాటు మాట్లడపోయేసరికి గాని తెలియలేదు నేను నిన్నెంత అభిమానిస్తున్నానో.. నువ్వు నన్ను ఎంత ఆక్రమించేశావో… ఇది తెలిసినాక మన మొదటి పరిచయం గుర్తుందా..

ఎంతో పరిచయమున్నా… ఇద్దరం ఎదురయ్యే సరికి మౌనమే… కానీ కనులను చూడు ఎంత వేగంగా మాట్లుడుకునేవో కదా… అందుకే అంటారనుకుంటాను కోల్పోయిన వాటిని గుర్తు చేసేది హృదయం అయినా… వాటిని వ్యక్తం చేసేది మాత్రం కన్నులే అని.

కంటి వెంట కన్నీరే

నీతో మాట్లాడాలని… పెదవి అంచున దాటని భావాలను నీ చెవిన వేయాలని ఎంత ఆతృత పడ్డానో నీకెలా తెలిపేది. గంటలు, రోజులు తరబడి ప్రిపేరై వచ్చాను. నువ్వు ఎదురయ్యే సరికి మాట రాక… కంటి వెంట కన్నీరే. నీకు ఎలా అర్థమయిందో తెలియదు. ఏమైనా అబ్బాయిలకు ధైర్యం ఎక్కువ అంటారు గానీ అది ఎంతవరకు నిజమో తెలీదు. నీకేదైనా ప్రమాదమొచ్చిందని తెలిసినా… పెద్దలను ఎదురించడానికైనా వచ్చే ధైర్యం మీతో మనసు విప్పి మాట్లాడేందుకు ఉండదని అప్పుడే తెలిసింది.

గంటల కొద్దీ ఫోటోలను చూస్తూ బతికేస్తాం గాని ఎదురు పడితే కల్లలో కల్లు పెట్టి చూడలేం.. అందుకే పెదవులు దాటని భావాలన్నీ మూటకట్టి… అక్షరాల దారిలో నీ చెంతకు చేరుస్తున్నా… ఇంతకంటే ఏమని చెప్పను.. ఎలా చెప్పను. నిన్ను రాణిలాగ.. దేవత లాగ చూసుకుంటానని చెప్పలేను గాని… నాకు జన్మనిచ్చిన అమ్మను ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటానో.. నా బతుకుకే వెలుగునిచ్చే నిన్ను అదేలా చూసుకుంటానని చెప్పగలను. నీకు దూరంగా ఉన్నానన్న మాటేగాని వెన్నంటే ఉండే నీ జ్ఞాపకాలు… నన్నంటే ఉండే నీ తలంపులు… దొర్లిపోయిన కాలంలో దొరకబుచ్చుకున్న క్షణాలు… ఎప్పటికీ నిలిచిపోయే నీ జ్ఞాపకాల దొంతలతో ఎదురుచూస్తూ.

                                                                               – అమ్ము (రచయిత)

ఈ మంచి కథ చదివారా?: సెకెండ్ ఛాన్స్‌

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?