ప్రజాకవి వేమన పద్యరత్నాలు

vemana

సంఘ సంస్కరణయుతమైన శతాధిక పద్యాలు రాసిన ప్రజాకవి వేమన. సమాజ సంస్కరణే లక్ష్యంగా దేశీయ ఛందస్సులో, అలతి పదాలతో అనల్పమైన పద్యరత్నాలను మానవాళికి అందించిన మహాకవి. #ప్రజాకవి వేమన పద్యరత్నాలు #

కాలగర్భంలో కలిసిపోయిన ఈ తెలుగు కవి చరిత్రను మళ్లీ మన తెనుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ గారిది. ఈ బ్రౌన్ మహనీయుడు తెలుగు భాషకు చేసిన సేవ ‘అనంతం’. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరుగునపడిన ఎన్నో అమూల్య గ్రంథాలను, ఎంతో శ్రమకోర్చి, సేకరించి, భద్రపరిచి మన తెలుగువారికి అందించారు.

కానీ నేడు తాను కూర్చున్న కొమ్మనే స్వయంగా నరుక్కొనే మూర్ఖుడి తరహాలో, మనం మన మాతృభాషను భ్రష్టుపట్టిస్తున్నాం! సరే ఈ విషయాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం!

సి.పి. బ్రౌన్‌గారు పండిత, పామర జనాల నోళ్లలో నానుతున్న వేమన పద్యాలను ఓ చోట చేర్చి, ఒక అమూల్యమైన నిధిని మనకందించారు. వాటిలోని కొన్ని అనర్ఘ రత్నాలు:

పద్యం:

అంతరంగమంద అపరాధములుచేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెరుగకున్న ఈశ్వరుండెరుగడా!
విశ్వదాభిరామ వినురవేమ!

 

తాత్పర్యం:

లోకంలో చాలామంది మనస్సులో నీచమైన ఆలోచనలు పెట్టుకొని, పైకి మాత్రం చాలా మంచివారిలాగా ప్రవర్తిస్తారు. అయితే ఈ విషయం ప్రజలు ఎరుగకున్నా , ఆ భగవంతుడికి మాత్రం తెలియకుండా పోదుకదా!

పద్యం:

విద్యగలిగియుండు వినయము లేకున్న
ఐదువలకు మేలిమైన మణుల
సొమ్మలుండి కంఠ సూత్రము లేనట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

 

తాత్పర్యం:

ముత్తయిదవకు ఆభరణాలు అన్నీ ఉండి మెడలో మంగళసూత్రం లేకపోతే ఎలాగుంటుందో అలాగే విద్య ఉన్నప్పటికీ వినయం లేకపోతే మనుష్యునికి రాణింపు ఉండదు.

పద్యం:

కాంచనంబుపైన కాంతలపైన
బెమ్మకైన బుట్టు దిమ్మతెగులు
తోయజాక్షి విడుచు దొర యెవ్వడునులేడు
విశ్వదాభిరామ వినురవేమ!

 

తాత్పర్యం:

బంగారంపైన, స్త్రీలపైన బ్రహ్మకు కూడా వ్యామోహం కలుగుతుంది. అందునా అందమైన స్త్రీని విడిచిపెట్టువారు ఎవ్వరూ ఉండరు.

పద్యం:

ధనము లేకయున్న ధైర్వంబు చిక్కదు
ధైర్యమొదవదేని ధన మొదవదు
ధనధైర్మిమరియదగు భూమి నరులకు
విశ్వదాభిరామ వినురవేమ!

 

తాత్పర్యం:

ధనం లేకపోతే ఏ పని చేయడానికైనా ధైర్యం చాలదు. ధైర్యం లేకపోతే ఏ పనినీ సాధించలేరు. అందువలన ఈ లోకంలో బ్రతకాలంటే ధనం, ధైర్యం రెండూ ఉండాలి.

పద్యం:

ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను దినక లెస్సదాచుగాక
తేనెనీగకూర్చి తెరవంకీయదా
విశ్వదాభిరామ వినురవేమ!

 

తాత్పర్యం:

తేనెటీగ, తేనెను సంపాదించి తాను తినకుండా తేనె పట్టులో దాస్తుంది. అది కాస్త ఎవరో పట్టుకుపోతారు. అలాగే లోకంలో మూర్ఖులు ధనం సంపాదించి ధర్మం చేయకుండా తాను తినకుండా దాస్తూ ఉంటారు. చివరికి వారు ఏమీ అనుభవించకుండానే గతిస్తారు. # ప్రజాకవి వేమన పద్యరత్నాలు #

ఈ మంచి కథ చదివారా?: మా అమ్మమ్మ

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?