బమ్మెర బోతనామాత్యుడు రాసిన శ్రీమద్భాగవతం నందలి అద్భుత ఘట్టం “గజేంద్ర మోక్షము”… అందులోని అమృతమయ పద్యాలు తెలుగు భాషాప్రియుల కోసం… # చవులూరించు గజేంద్ర మోక్షము #
మII అల వైకుంఠపురములో, నగరిలో నామూలసౌధంబు దా
పల, మందారవనాంతరామృతసరః ప్రాంతేంతు కాంతోపలో
త్పల, పర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము ‘పాహి-పాహి’ యనఁ గుయ్యాలించి సంరంభి యై
తాత్పర్యం:
వైకుంఠపురమునందలి గొప్ప మేడవైపుగల కల్పవృక్షముల వనమునందలి అమృత సరోవరం యొక్క తీరమందు చంద్రకాంత శిలావేదికయందు తామరపూల పాన్పునందు శ్రీదేవితో ఆనందించుచుండిన దీనశరణ్యుండగు శ్రీమన్నారాయణమూర్తి తన భక్తుడయిన గజరాజు బాధపడుచు “దేవా! నన్ను రక్షింపు”మని వేడుకొనుచుండగా యా మొరవిని తొందరపడి లేచి…
మII సిరికింజెప్పఁడుశంఖచక్రయుగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగపతిం బన్నింపఁడాకర్ణికాం
తరధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు, వివాదప్రోద్ధతశ్రీకుచో
పరి చేలాంచల మైన వీడఁడు గజ ప్రాణపనోత్సాహియై
తాత్పర్యం:
భక్తుల కధీనుండగు శ్రీమన్నారాయణుండు తన భక్తుండగు గజరాజు నాపదనుండి గాపాడగోరి తొందరలో లక్ష్మిదేవితో చెప్పక, శంఖచక్రములను ధరింపక పరిజనులను పిలువక, గరుత్మంతుని సిద్ధపరపక, విడిపోయిన తలవెంట్రుకలను ముడివేసుకొనక, దేవితో ప్రణయ కలహమునందు వినోదమునకై పట్టుకొనిన పయిటకొంగునైనను విడువక బయలుదేరెను ఆ దేవదేవుడు.
ఇదీ చూడండి: ఈ Whatsapp toolను మీరు చూశారా?
ఇదీ చూడండి: ప్రజాకవి వేమన పద్యరత్నాలు