ఈ మాట అంచున నిశ్శబ్దం

rape victim

అత్యాచారం జరింగిందని తెలిసినప్పుడు … అత్యాచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడు అమ్మాయిపై జరిగిన హింస, ఆమెకు జరగాల్సిన న్యాయం గురించే అంతా చర్చిస్తారు. సమాజంలో ఆ అమ్మాయి గౌరవం, ఆమె పెళ్లిపైన పడే ప్రభావం గురించి చాలామంది ఆలోచించరు. ఆ అత్యాచార ప్రభావం బాధితురాలి మనసు మీద, ఆలోచన మీద ఎలా ఉంటుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. కానీ, అత్యాచార బాధితులు ఆ తరువాత ఇళ్లలోనే బందీలుగా మారతారు. బయటకు రావడానికి భయపడతారు. మనుషుల పట్ల నమ్మకం కోల్పోతారు. తమ బాధను అధిగమించడానికి తీవ్రమైన సంఘర్షణకు లోనవుతారు. # ఈ మాట అంచున నిశ్శబ్దం #

అవును ఏ మనిషికైనా ప్రాణం కంటే విలువైనది మానం అంటారు. అదే పోయాక ప్రాణముండి ఏంలాభం అనిపించే పరిస్థితి. తనతో పాటు తన తోబుట్టువులు… తల్లిదండ్రులు ఎదుర్కునే చిత్కారాలు అన్నీ ఇన్నీ కావు.. ఇలా చెయ్యని పాపానికి అర్ధాంతరంగా కరిగిపోయిన ఓ బాలిక కన్నీటి గాధే… ఈ మాట అంచున నిశ్శబ్దం.

భయం… భయం…

భయం… బతుకంటే భయం… మనుషులంటే భయం… సమాజమంటే భయం… ఆఖరుకు చావంటే భయం… అప్పటి వరకూ సంతోషంగా గడిచిన నా జీవితం ఒక్క ఘటనతో అతఃపాతాళానికి పడిపోయింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న నా జీవితం కటిక చీకట్లో పడిపోయింది. అందరూ మనవాళ్లే అనుకునే నాకు కన్నవాళ్లను చూసినా భయమేస్తోంది. అందర్నీ సులభంగా నమ్మేసే నాకు… నా బతుకుమీదే నమ్మకాన్ని కాలరాసింది ఆ ఘటన..

చిదిమేశాడు…

అక్కా అంటూ అస్తమాటు మా ఇంటికొచ్చే పక్కింటి బాబాయి నా జీవితాన్ని చిదిమేశాడు. లాలనగా తన చేతుల్లోకి తీసుకుంటున్నాడే అనుకునేదాన్ని గాని… అతని కళ్లలో కాలకూట విషాన్ని గుర్తించలేకపోయాను. అమ్మా. నాన్న బయటకు వెళ్లిన ఆ రోజు నా బతుకును ప్రశ్నార్థకం చేసింది. అతడు నాకంటే బలవంతుడు… వయసులో రెండింతల పెద్దవాడు. అప్పటికే అతడిపై చాలా నేరాలు ఉన్నాయని నాకు తర్వాతే తెలిసింది. అడుగు వేయలేని పరిస్థితి… ఇదీ అని కన్నతల్లితో కూడా నోరు విప్పి చెప్పుకోలేని దుస్థితి.

అభిమానమే ప్రాణంగా బతికే నాన్నకు ఈ సంగతి తెలిస్తే తట్టుకోగాలడా… చదువే ప్రాణంగా బడికెళ్తున్న చెల్లి చదువు సాగుతుందా… ఏ ఇంట శుభకార్యం జరుగుతున్నా అన్నీ దగ్గరుండి చక్కబెట్టే అమ్మ ఎవ్వరికైనా మొహం చూపించగలదా… నా ఒక్కదాని వల్ల ఇందరు బాధపడాలా? ప్రశ్నలు తొలిచేశాయి.

నెల రోజుల్లో పదోతరగతి పరీక్షలు… ఈసారి స్కూలు ఫస్ట్ వస్తానని నాపై నమ్మకం పెట్టుకున్న మాస్టరుకు ఈ విషయం తెలిస్తే వద్దు చెప్పకూడదు. నాలోనే…నాతోనే ఇది అంతమైపోవాలి. ఒకవేళ నేను చనిపోయినా ఇదీ కారణం అని కూడా ఎవ్వరికీ తెలియకూడదని నిర్ణయించుకున్నాను.

వెన్ను నుంచి పొత్తికడుపులోకి పలుగులా దిగబడుతున్న బాధను పంటికింద బిగబట్టి… జలధారలా కారుతున్న కన్నీటితో రక్తపు మరకలను కడిగేసి… తడబడుతున్న పాదాలకు ఒక్కో అడుగూ పేర్చుకుంటూ… తల్లడిల్లుతున్న మనసును సాంత్వన పరచుకునేందుకు ప్రయత్నం..మాటల్లో చెప్పలేనిది.

ఇంటికొచ్చిన అమ్మ,నాన్నతో ఎప్పటిలాగ ఉండలేక.. లోలోపలే కుమిలిపోయాను… కమిలిన దేహం కనబడకుండా.. శతవిధాల ప్రయత్నించాను. రోజులాగ అమ్మకు అన్ని పనుల్లో సాయం చేయలేక పోయేదాన్ని… నాన్నకు వ్యవసాయ పనుల్లో.. చెల్లికి చదువులో సాయం చేయలేక పోయేదాన్ని… చివరకు శౌచాలయానికి వెళ్లినప్పుడు నేను పడిన వేదన వర్ణణాతీతం..

ఎవరికీ చెప్పుకోలేక…

సమీపంలో ఎవ్వరూ లేకుండా… ఒంటరిగా కూర్చుని ఏడవడం… కన్నీళ్లతోనే నా బాధను చెప్పుకోవడం అలవాటు చేసుకున్నాను. ప్రాణం పోతున్నట్లు అనిపించిన ఘటన తలచుకున్నప్పుడల్లా భయంతో వణుకుపుడుతుంది. చివరి పరీక్షరాసి ఇంటికి తిరుగొచ్చినప్పుడు కళ్ళు మసక బారాయి. # ఈ మాట అంచున నిశ్శబ్దం #

నెల రోజుల్లో సగం అయిపోయాను.. చదువు ధ్యాసలో పడి ఇలా అయిపోతున్నానేమో అని ఇంట్లో వాళ్లు అనుకునే వారు. అసలు విషయం వాళ్లకు చెప్పలేని పరిస్థితి నాది. చివరి పరీక్ష అయిపోయిన తర్వాత ఇంటికొస్తుంటే దారిలో పడిపోయానంట. మెలకువ వచ్చేసరికి మంచంపై ఉన్నాను. బయట నుంచి పెద్దగా కేకలు.. సాధింపులు… తిట్లు వినిపిస్తున్నాయి. అమ్మ నాన్న ముభావంగా కూర్చుని ఉన్నారు. అసలు ఏమైందో తెలియడం లేదు. కన్నీళ్లు నింపుకుని వచ్చిన అమ్మ దగ్గరకొచ్చి కూర్చుంది.

నెలతప్పానంట…

ఏమైందమ్మా అడిగా… అప్పడు ఆమె నోట వెంట విన్న మాట నన్ను శిలాప్రతిమ చేసింది. నేను నెలతప్పానంట… కన్నీరు ఇంకిపోయింది. చుట్టూ ఏమి జరుగుతుందో తెలియడం లేదు. నా మొహం నాకు చూపించలేక ఆ క్షణమే చనిపోతే ఎంతబాగుండు అనిపించింది.

ఇంత జరిగినా నాన్న ఏమీ అనకుండా నా పక్కకొచ్చి అసులు ఏమైందమ్మా… ఎవరు ఆ ఆబ్బాయి.. మీ ఇద్దరకూ ఇష్టం అయితే వాళ్ల పెద్దవాళ్లతో నేను మాట్లడతానని గోముగా చెబుతున్నాడు. అసలు విషయం ఇది నాన్న అని చెప్పలేని పరిస్థితి. నా పరిస్థితి గమనించిన నాన్న దగ్గరకు తీసుకున్నప్పుడు గుండెల్లోనే గూడు కట్టుకున్న వేదన ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. నా ప్రమేయం లేకుండానే మొత్తం చెప్పేశాను. జరిగిందంతా తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పసి మొగ్గలాంటి నువ్వు ఇంత వేదనను ఎలా భరించావమ్మా అంటూ గుండెలవిసేలా రోదించాడు.

పోరాటం మొదలైంది…

అంతలోనే ధైర్యం తెచ్చుకుని నాకొచ్చిన పరిస్థితి మరే అమ్మాయికీ జరగకూడదని నిర్ణయించుకున్నాడు. విషయం మొత్తాన్ని ఊళ్లో పెద్దలకు చెప్పాడు. వారంతా తలో మాట అని నాన్నని హీనంగా మాట్లాడారు. అయినా ఆయన తగ్గలేదు. విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీడియాలో నామీద సానుభూతి కథనాలు.. ఊళ్లలో నిరసనలు చేపట్టారు.

ఇవన్నీ నాకు న్యాయం జరగడానికి జరుగుతున్నాయో… లేక మరే పరిస్థితో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు పోలీసుల మాటల వేధింపులు.. అసలు ఎలా జరిగింది. ఎక్కడెక్కడ చేయి వేశాడు.. వంటి నోటితో చెప్పుకోలేని ప్రశ్నలు నన్ను మరింత వేధించాయి.

అండ దొరికింది…

ఆ పరిస్థితిలో నాకు దీపంలా కనిపించింది స్పందన సంస్థ…. నాలాంటి వారినందరినీ చేరదీసి మానసికంగా… శారీరకంగా నిలదొక్కుకునేందుకు అండగా నిలబడ్డారు. మొదటిసారి కోర్టుకు వెళ్లినప్పుడు నాకంతా వింతగా అనిపించింది. ఏ తప్పూ చేయని నేను దోషిలా ఉన్నాను. తప్పు చేసిన వారేమో హుందాగా వస్తున్నారు. విచారణ సమయంలో మాకెన్నో బెదిరింపులు వచ్చాయి. మాపై సామ, వేద, దండోపాయాలు ప్రయోగించారు. వేటికీ లొంగకపోయేసరికి దాడికి కూడా వెనకాడలేదు.

ఏది ఏమైనా… తన ప్రాణం పోయినా కేసు గెలవాలని నాన్న చెప్పాడు. సమాజంలో న్యాయం బతికున్నదని తెలియాలంటే నిందితుడికి శిక్ష పడేవరకూ వెనక్కి తగ్గొదని సూచించారు. ఊహించినట్లుగానే వాళ్లు మానాన్నను దారికాచి చంపేశారు. ఆ ఘటన నాలో మరింత పట్టుదలను పెంచింది. కొన ప్రాణం ఉన్నంతవరకూ న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను. చివరకు న్యాయం గెలిచింది. నిందితుడికి శిక్షపడింది.

న్యాయం జరిగిందా?!

ఇంతవరకూ సరే ఇంతకీ నాకు న్యాయం ఏం జరిగిందో తెలియడం లేదు. సమాజంలో ఈసడింపులు… కుటుంబ సభ్యుల చిత్కారాలు… అసలు నేనేం తప్పుచేశాను… ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు. న్యాయాన్ని బతికించాను… మరొకరికి నాలాంటి పరిస్థితి రాకుండా అడ్డుకున్నాను… నాలాంటి వారందరిలో ఎనలేని ధైర్యాన్ని నింపాను.

                                                                                       – అమ్ము (రచయిత)

ఈ మంచి కథ చదివారా?: మా అమ్మమ్మ

Click here: HOW TO INVEST IN STOCK MARKET?   

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?