అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

abhimanyu

గెలుపు.. ఏదైనా సాధించాలనే ఉత్సాహాన్నిస్తే, ఓటమి.. హేళన చేస్తుంది. కానీ ఓటమికి తెలియదు. మనిషి తలచుకుంటే గెలుపు పెద్ద లెక్క కాదని. “ఇలాంటి మాటలు చాలా విన్నాం.. చేయడమే కష్టం” అంటారా? అయితే ఈ 16 ఏళ్ల యువకుడి కథ తెలుసుకుందాం రండి.. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ #

ఇతను లేకుండా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని చెప్పలేం. అది మరెవరో కాదు అర్జునుడి కుమారుడు ‘అభిమన్యుడు’.

పద్మవ్యూహం…

ఒక రోజు గర్భవతిగా ఉన్న భార్య సుభద్రకు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వివరిస్తున్నాడు అర్జునుడు. ‘పద్మవ్యూహం’ దీనినే ‘చక్రవ్యూహం’ అని కూడా అంటారు. ఈ వ్యూహాన్ని ఛేదించడం అంత సులువు కాదు.

ఒకరిని చంపితే క్షణం గడవక ముందే వారి స్థానాన్ని మరొకరు భర్తీ చేసి దుర్భేద్యమైన గోడను నిర్మించే వలయం. ద్రోణాచార్యుడి నుంచి అర్జునుడు నేర్చుకున్న వ్యూహం. అలాంటి వ్యూహంలోకి ప్రవేశించడం అభిమన్యుడు తల్లి గర్భం నుంచి వింటూ తెలుసుకున్నాడు. అయితే కాసేపటికే భార్య సుభద్ర నిద్రించడాన్ని గమనించిన అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్పడం మధ్యలోనే ఆపేశాడు. దాని వల్ల పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసుకున్న అభిమన్యుడు.. బయటకు వచ్చే మార్గాన్ని తెలుసుకోలేకపోయాడు.

కురుక్షేత్రం…

కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. 13వ రోజు కౌరవులు… పాండవులను ఓడించడానికి పద్మవ్యూహాన్ని ఎంచుకుంటారు. కృష్ణార్జునులు ఇద్దరికీ పద్మవ్యూహాన్ని ఛేదించడం పూర్తిగా తెలుసన్న నమ్మకంతో పాండవులు యుద్ధానికి సిద్ధమవుతారు.

దుర్యోధనుడి పన్నాగం…

అయితే అదే రోజు అర్జునుడ్ని సంహరించడానికి దుర్యోధనుడు… ‘సంషప్తకులు’ అనే సైన్యాన్ని కృష్ణార్జునులపైకి ఉసిగొల్పాడు. వీరి యుద్ధరీతి భయంకరంగా ఉంటుంది. రణరంగంలో కాలు మోపితే ‘అయితే గెలుపు.. లేకపోతే చావు’ అనేలా పోరాడతారు.

ఈ పరిస్థితిలో పద్మవ్యూహాన్ని ఛేదించగలిగేది అభిమన్యుడు మాత్రమేనని, యుద్ధం చేయమని ధర్మరాజు.. అభిమన్యుడ్ని అడిగాడు. కానీ తనకు పద్మవ్యూహం లోపలికి వెళ్లడం మాత్రమే తెలుసని, రావడం తెలియదని అభిమన్యుడు చెప్తాడు.

“నువ్వు యుద్ధం చెయ్.. నీ వెనుక భీమసేనుడు, నకుల, సహదేవులతో వచ్చి.. కౌరవ సైన్యానికి ముచ్చెమటలు పట్టిస్తాను”  అని ధర్మరాజు చెప్తాడు.

సైంధవుడు…

అభిమన్యుడు చిచ్చరపిడుగులా కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. అన్నమాట ప్రకారం భీమ, యుధిష్ఠర, నకుల, సహదేవులు… అభిమన్యుడి వెనుకే వచ్చే ప్రయత్నం చేశారు.

అయితే వారిని సైంధవుడు అడ్డుకున్నాడు. అర్జునుడ్ని మినహాయించి.. మిగిలిన పాండవుల్ని ఒకరోజు అడ్డుకునే శక్తిని శివుడి నుంచి వరంగా పొందినవాడు సైంధవుడు. ఈ వరాన్ని సరిగ్గా అదే రోజు ఉపయోగించాడు. పాండవులు కాకపోయినా వీరాధివీరుడైన అర్జునుడి కొడుకు చస్తే చాలని సైంధవుడు అనుకున్నాడు.

పాండవ సైన్యాన్ని అడ్డుకోవడం వల్ల అభిమన్యుడు ఒంటరివాడయ్యాడు. అయినా అభిమన్యుడు ఏమాత్రం బెదరలేదు. కౌరవ సైన్యాన్ని కకావికలం చేయాలనుకున్నాడు. రథాన్ని ద్రోణాచార్యుడి వైపు తీసుకువెళ్లమని రథసారథితో అంటాడు. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’#

abimanyudu కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని వీరోచిత పోరాట దృశ్యం

 దానికి ఆ రథసారథి ” ఓ రాకుమారా.. అస్త్రశస్త్రాల్లో ఆరితేరిన ద్రోణాచార్యుడి వైపు రథాన్ని పోనివ్వమంటున్నావు.. నీకేమైనా అయితే ఎంత బాధ పడతారు అందరూ.. ఒక్కసారి ఆలోచించు” అని ప్రాధేయపడ్డాడు.

“నా ఎదుట నిలిచింది ఆ ద్రోణుడైనా.. ఆఖరికి సురాధిపతి దేవేంద్రుడైనా.. ఈ యుద్ధరంగాన పోరాడాల్సిందే” అన్నాడు అభిమన్యుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన సారథి.. రథాన్ని ద్రోణాచార్యుడి వైపు పోనిస్తాడు. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ #

ఏం యుద్ధం ఏం యుద్ధం…?

అభిమన్యుడు బాణాలు సంధించి కురుసేనలకు చుక్కలు చూపించాడు. ఒక పెను తుపాను వస్తే మొక్క, మహా వృక్షం అని తేడా లేకుండా.. ఎలా అయితే భూమి నుంచి పెకలించి వేసేస్తుందో… అలా ఒక సైనికుడు, మహా యోధుడు అన్నది చూడకుండా అందిరినీ ఒంటి చేత్తో విసిరి పారేస్తున్నాడు అభిమన్యుడు.

దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ కుమారుడ్ని, కర్ణుడి సైన్యాన్ని ఇలా ఎందరో అతిరథ మహారథుల్ని అంతం చేశాడు. అభిమన్యుడి దెబ్బకు దుశ్శాసనుడు మూర్ఛపోయాడు. కర్ణ, ద్రోణ, దుర్యోధనుల గుండెలు గగుర్పొడిచేలా యుద్ధం చేశాడు. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ #

కోపంతో రగిలిపోయిన దుర్యోధనుడు… అభిమన్యుడ్ని సంహరించమని కౌరవసేన మొత్తాన్ని ఆదేశించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు… అభిమన్యుడి యుద్ధ నైపుణ్యాన్ని గమనించి.. అతని చేతిలో ఏ ఆయుధం ఉన్నా.. ఎదుటివారికి మరణం తప్పదని గ్రహించి, కర్ణుడిని.. అభిమన్యుడి విల్లు విరిగేలా బాణాలను సంధించమన్నాడు.

కర్ణుడు.. అభిమన్యుడి విల్లు విరిగేలా బాణాలు వేయగా, కృపాచార్యుడు… అభిమన్యుడి సారథిని సంహరించాడు. ద్రోణాచార్యుడు రథ అశ్వాలను చంపేశాడు. ఇవన్నీ ఏకకాలంలో జరిగాయి. అయినా అభిమన్యుడిలో వేగం తగ్గలేదు. గజ,రథ, అశ్వదళాలు అన్నీ కలిసికట్టుగా తనపై దాడి చేస్తుంటే ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో రథ చక్రాన్ని డాలుగా ఉపయోగించి పోరాడాడు.

ఆ ఖడ్గాన్ని కూడా కౌరవులు దూరం చేశారు. ఇక రథ చక్రాన్నే ఆయుధంగా చేసుకుని గిరగిరా తిప్పుతూ యుద్ధం చేశాడు. అప్పుడు దుశ్శాసనుడి కొడుకు గధతో అభిమన్యుడి చక్రాన్ని విరగ్గొట్టాడు. యుద్ధ భూమి నుంచి ఓ గధ తీసుకుని దుశ్శాసనుడి కొడుకుపై అభిమన్యుడు విరుచుకుపడ్డాడు. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’#

ఇద్దరి మధ్య పోరు హోరాహోరిగా సాగింది. దుశ్శాసన కుమారుడు.. అభిమన్యుడి తల పగలగొట్టాడు. అభిమన్యుడు కుప్పకూలిపోయాడు. అయినా కసితీరని కౌరవులు.. అభిమన్యుడి శరీరాన్ని కత్తులతో, బల్లాలతో కుళ్లబొడిచారు. ఇలా అధర్మంగా అభిమన్యుడ్ని చంపేశారు.

అధర్మ యుద్ధాన్ని ఆదేశించినందుకు దుర్యోధనుడు, అమలు పరిచినందుకు ద్రోణుడు, పాలుపంచుకున్నందుకు కర్ణుడు అధర్మంగానే అంతమయ్యారు.

అభిమన్యు నుంచి ఏం నేర్చుకోవచ్చు…?

 అభిమన్యుడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.

మనకి ఎంత తెలుసని కాదు… తెలిసిన దానిని సరైన రీతిలో వాడుకున్నామా? లేదా? అనేది ముఖ్యం.

జీవితంలో ఎన్నో అనుకుంటాం. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు. అప్పుడు ఎదురైన పరిస్థితులకు తగినట్లు మనం మారాలి.

మన ముందు ఎంత పెద్ద కష్టమైనా ఉండొచ్చు. కానీ వెనుకడుగు వెయ్యకుండా పోరాడాలి.

“నిజమైన పోరాటానికి అర్థం.. ఓడిపోయే వరకు పోరాడటం కాదు… ఊపిరిపోయే వరకు పోరాడటం.”

                                                                           రచయిత – యుగ (కే.ఎం.కే)

ఈ మంచి కథ చదివారా?: మా అమ్మమ్మ

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?